Monday, 15 September 2014

Healthy And Easy Breakfasts Kids

పిల్లల మెను



పిల్లలకి పోషకాహారం ఇస్తున్నామా లేదా.. క్యాలరీలు, ప్రొటీన్లు సరిగ్గా అందుతున్నాయా లేదా.. అమ్మకి అన్నీ సందేహాలే! అందుకే మూడేళ్ళ నుంచి తొమ్మిదేళ్ళ పిల్లలకు రోజుకెన్ని క్యాలరీలు తప్పనిసరిగా అందాలి. ఎంత ప్రొటీన్ ఆహారంలో వుండేలా చూసుకోవాలి... వంటి వివరాలు వివరంగా ‘అమ్మకోసం’.

* 3 సంవత్సరాల చిన్నారులకు రోజుకు 1200 క్యాలరీల ఆహారం అందులో 22 గ్రాముల ప్రొటీన్లు వుండాలి.

* ఇక 4 నుంచి 6 ఏళ్ళ వయసు వారికి రోజూ 1700 క్యాలరీలు, అందులో 40 గ్రాముల ప్రొటీన్లు తప్పనిసరి.

* ఇక ఏడేళ్ళ నుంచి తొమ్మిదేళ్ళ వయసు చిన్నారులకు రోజూ 1950 క్యాలరీలు అందులో 41 గ్రాముల ప్రొటీన్లు వుండాలి.

కేవలం ప్రొటీన్లనే కాకుండా కాల్షియం, ఐరన్... తదితర పోషకాలూ పిల్లలకి సమానంగా అందినప్పుడే వారి శారీరక, మానసిక ఎదుగుదల సంపూర్ణంగా వుంటుంది.

ఈ లెక్కలన్నీ ఎలా సరిచూసుకోవటం అంటే నిపుణులు కొన్ని ఆహార పదార్ధాలని సూచిస్తున్నారు. వీటిని పిల్లలకి తయారుచేసి పెట్టడం ద్వారా పిల్లలకు తగినన్ని క్యాలరీలు, ప్రొటీన్లు అందించవచ్చు.



ఉదయాన్నే...

పాలు తాగించాలి. ఆ తర్వాత ఈ క్రిందివాటిల్లో రోజుకు ఓ రకం వారికి తినిపించాలి.

ఉడకబట్టిన కోడిగుడ్డు
బ్రెడ్ ఆమ్లెట్
గుడ్డు పొరటు
పాలక్ రోటీ
ఆలూ రోటీ
ఇడ్లీ
క్యారట్ ఇడ్లీ
మేతీ రోటీ
సోయా జావ
సోయా, గోధుమపిండి కలిపిన చపాతీ.


పై వాటిల్లోంచి ప్రొటీన్లతోపాటు విటమిన్-ఎ పుష్కలంగా లభించి పిల్లలు చురుకుగా వుంటారు. కంటి చూపు బావుంటుంది.

బ్రేక్ టైమ్‌లో...

ఇక స్కూలు విరామ సమయంలో పిల్లలకు స్నాక్స్ ఇవ్వాల్సినప్పుడు...

1. టమాటో సూప్
2. వెజ్ సూప్
3. పండ్ల రసాలు
4. కస్టర్డ్
5. బాదం పాలు
6. రాగిజావ


వీటిల్లో రోజుకు ఒకటి ఇవ్వగలిగితే చాలు. అలానే వీటిని తయారు చేసేప్పుడు పంచదార బదులు బెల్లం వాడితే పిల్లలకి తగినంత ఐరన్ కూడా అంది శక్తి లభిస్తుంది.
మధ్యాహ్నం లంచ్ బాక్స్‌లో....

లంచ్ బాక్స్‌లో వీలయినంత వరకు రోజుకు ఒక వెరైటీ అందించడానికి ప్రయత్నించాలిట. రంగు, రుచి ఈ రెండూ పిల్లలని ఆకర్షించే అంశాలు కాబట్టి బాక్స్‌లో పెట్టే భోజనం రుచిగానే కాక ఆకర్షణీయంగా కూడా వుండేలా చూసుకుంటే పిల్లలకి లంచ్ బాక్స్‌లో భోజనం వదిలేయడం వంటివి చేయరు.

లంచ్ బాక్స్‌లో తప్పనిసరిగా ఆకుకూర, కూరగాయలు, పప్పు వుండాలి. ఆకుకూర పప్పు, కూరలతో బాక్స్ కట్టవచ్చు. లేదంటే....

1. కిచిడి
2. వెజ్ రైస్
3. ఆకు కూరలతో రైస్ ఐటమ్స్. ఉదాహరణకి పాలక్ రైస్, మేతీ రైస్...
4. టమాటా రైస్ లాంటివి


ఇలా రైస్ ఐటమ్స్ పెట్టినప్పుడు తప్పనిసరిగా క్యారట్, టమాట వంటి కూరగాయలతో చేసిన రైతాను ఇవ్వాలి. మొత్తానికి ఆకుకూరలు, కూరగాయలు పిల్లలకు రోజు అందేలా చూసుకుంటే చాలు వాళ్ళ ఎదుగుదలకి కావలసిన పోషకాలు అందినట్టే.

సాయంత్రం ఏం పెట్టొచ్చు అంటే...

పాలతోపాటు కార్న్ ఫ్లేక్స్ ఇవ్వచ్చు. లేదా అటుకులు, పాలు, బెల్లంతో తయారుచేసే కీర్ వంటివి పిల్లల ఆకలిని తీర్చడంతోపాటు వారికి ఆరోగ్యాన్ని ఇస్తాయి.

రాత్రి భోజనానికి...

పప్పులతో చేసే కిచిడీ, పన్నీర్‌తో చేసిన రోటీ, కూరగాయలతో భోజనం ఇస్తూ తప్పనిసరిగా ఓ కప్పు పెరుగు తినిపించాలి. రాత్రిపూట భోజనం పడుకునే ముందు కాక రాత్రి ఏడు గంటలకల్లా పెట్టి పడుకునే ముందు ఓ గ్లాసు పాలు తాగిస్తే ఆ రోజుకి పిల్లలకి అందాల్సిన పోషకాలన్నీ అందినట్టే.

ఇటీవలి కాలంలో పిల్లల్లో పోషక లోపం ఎక్కువైనట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకు కారణం అవగాహన వున్నా పాటించకపోవటం అంటున్నారు నిపుణులు. ఏదో ఒకటి పిల్లలు పేచీ పెట్టకుండా తింటే చాలని కాకుండా ఎదుగుదలకి అవసరమైన పోషకాలన్నీ వారికి అందేట్టు రోజువారీ ఆహారాన్ని ముందే ప్లాన్ చేసుకుని అందిస్తే పిల్లలు ఉత్సాహంగా, ఆరోగ్యంగా వుంటారు. ఆట పాటల్లో, చదువులో రాణిస్తారు అని సూచిస్తున్నారు నిపుణులు. మరి ‘అమ్మలూ’ ఆలోచించండి.

No comments:

Post a Comment